పాకిస్థాన్ చరిత్ర క్లుప్తంగా

 పాకిస్థాన్ 


ఈ పోస్ట్ ప్రధానంగా ఈ క్రింది పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది.

Hussain Haqqani 

1.Pakistan: Between Mosque and Military

2.Magnificent Delusions: Pakistan, the United States, and an Epic History of Misunderstanding.


Christine Fair 

3.Fighting to the End: The Pakistan Army's Way of War


పాకిస్థాన్ మన దాయాది దేశం.ఆ దేశ చరిత్ర మరి ఎంతమంది భారతీయులకు తెలుసో ఏమోగానీ ఆ దేశం పేరు వింటే మన దేశంలో జనాలకు ఎక్కువగా గుర్తుకు వచ్చే విషయాలు 

కాశ్మీర్, తీవ్రవాదం,క్రికెట్,ముస్లింలు,చరిత్రలో చదువుకున్న ఉపఖండ విభజన.మనతో పాటే కలసి పంచుకున్న సంస్క్రతి ఉన్న దేశం.కానీ ఎందుకిలా ఇస్లామిక్ రిపబ్లికై తీవ్ర వాదానికి కేంద్ర బిందువైంది.ఏదైనా దేశంలో మతం పరిపాలనలో పాత్ర వహిస్తే జరిగే అనర్థాలకు పాకిస్థాన్ కన్నా మంచి ఉదాహరణ ఉండదు.ఈ దేశ చరిత్ర మనకు ప్రత్యేకంగా హిందూ జాతీయ వాదులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు కూడా మతం పేరుతో మన దేశ విభిన్న సంస్క్రతిపై ఏకరూపత సంస్క్రతిని బలవంతంగా రుద్దుదామనుకుంటున్నారు.


చరిత్ర, రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువ ఆసక్తి గల నాకు పాకిస్థాన్ ఎందుకిలా మారింది అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేది.వార్తాపత్రికలు, కొన్ని చరిత్ర పుస్తకాలలో ఆదేశం గురించి చదువుకున్నప్పటికీ పూర్తి సంతృప్తి ఉండేది కాదు.ఒక ఏడేళ్ల క్రితం యూట్యూబ్ లో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కాని గారి వీడియో చూడడం తటస్థించింది.ఒక పాకిస్థానీ అయ్యుండి ఈయనేంటి ఇంత తీవ్రంగా పాకిస్థాన్ విధానాలను విమర్శిస్తున్నాడు అని ఆయన గురించి వెతికి ఆయన పాకిస్థాన్ మీద రాసిన పుస్తకాలు చదవడం ప్రారంభించా.పూర్తిగా చదివిన తర్వాత నాకు అప్పటిదాకా ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది.

దీని తర్వాత క్రిస్టీన్ ఫెయిర్ గారని అమెరికన్ రాజనీతిజ్ఞురాలు పాకిస్థాన్ ఆర్మీ మీద రాసిన పుస్తకం కూడా నాకు చాలా ఉపయోగపడింది.దురదృష్టం ఏమిటంటే వీళ్ళిద్దరి పేర్లు చెబితే పాకిస్థాన్ అధికార వర్గాలు ఇంతెత్తున లేగుస్తారు.ఎందుకంటే నిజం విమర్శలు తట్టుకోవడం చాలా కష్టం కదా 


ఇక అసలు విషయానికి వస్తే ఈ పోస్ట్ లో నేను పాకిస్థాన్ డెబ్బై ఏళ్ళ చరిత్ర ను క్లుప్తంగా వివరిస్తాను.అందుకు  పాకిస్థాన్ ఆర్మీ , ఇస్లాం మత చాంధసవాదం కేంద్రాలుగా ఆ దేశ చరిత్రను విశ్లేషిస్తాను.కొన్ని దశలుగా చరిత్ర ను విభజిస్తే

 1.విభజన ఒడిదుడుకులు(1947-56)


  2.మిలటరి తిరుగుబాటు అయూబ్, యాహ్యఖాన్ పరిపాలన, బంగ్లాదేశ్ ఆవిర్భావం(1956-71).


3.పాకిస్థాన్ పూర్తి ఇస్లామీకరణ దశ,భుట్టో,హక్ పరిపాలన (1971-1989).


4.కాశ్మీర్ మిలిటెంట్ వేర్పాటువాదం ఉచ్ఛదశ పాకిస్థాన్ తీవవాద కేంద్రం గా మార్పు,ముషారఫ్ కాలం(1989-2007).


5.ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన(2007-2019)


1.విభజన ఒడిదుడుకులు(1947-56):

పాకిస్థాన్ పేరు అసలు అర్థం 

పాక్ అంటే పవిత్రం స్థాన్ అంటే ప్రదేశం అంటే  పవిత్ర ప్రదేశం.అయితే పాకిస్థాన్ అనేపదం అప్పటి ప్రావిన్స్ల మొదటి పదాలను తీసుకొని రాసింది. పంజాబ్, కాశ్మీర్, ఆప్ఘనియా,సింధు, మరియు బెలూచిస్థాన్.ఇందులో బెంగాల్ లేదు.

జిన్నా నాయకత్వంలో 1940 నుంచి 1947 వరకు ఉపఖండ ముస్లింల రక్షణ కు ప్రయోజనాల పేరుతో పాకిస్థాన్ ఉధ్యమం జరిగింది.

తూర్పు పశ్చిమ పాకిస్థాన్లు కలిపి అప్పటి బ్రిటిష్ ఇండియా లో దాదాపు ఇరవైశాతం జనాభా ఉంటుంది. అప్పటి ఆర్థిక వనరులలో పదిహేడు శాతం వాటి వాటాగా వచ్చింది అయితే సైన్యాన్ని విభజించినప్పుడు మూడోవంతు వెళ్ళింది అంటే వనరులు కన్నా రెండు రెట్లు ఎక్కువ సైన్యం వెళ్ళింది. ఇక్కడే సైన్యం ఆధిపత్యానికి బీజం పడింది. దీనితోపాటు కాశ్మీర్ పైకి దండయాత్ర చేయడం ఇంకా సైన్యం ప్రాధాన్యతను పెంచింది.

తెలివి దూరద్రుష్టి ఉన్న నాయకుడు అంత ఎక్కువ ఉన్న సైన్యాన్ని కుదించి అవసరాలకు తగ్గట్టు వాడుకునేవారు కానీ కాశ్మీర్ గందరగోళంలో జిన్నా ఆ పనిచేయలేదు.ఎక్కువ కాలం బతికుంటే ఆయన ఏమన్నా చేసేవారేమో కానీ ఆయన 1948లోనే చనిపోవడంతో పాకిస్థాన్కి పురిటిలోనే పెద్ద దెబ్బ తగిలింది. అదీగాక పాకిస్థాన్ ఏర్పాటు కోసం రెచ్చగొట్టిన మత విద్వేషాలు ఇంకా అలానే ఉండటంతో ఆ ప్రభావం రాజ్యాంగం ఎలా ఉండాలి పరిపాలనలో ఇస్లాం పాత్ర దగ్గర తీవ్రంగా ఘర్షణలు జరిగాయి.పరిపాలన లో మతాచార్యుల జోక్యం పెరిగింది.ఇలా ఒక మత చాంధసవాది చేతిలో జిన్నా తర్వాత అంత ప్రముఖ నాయకుడైన అప్పటి ప్రధానమంత్రి  లియాకత్ ఆలీ  హత్య చేయపడ్డాడు. ఇక ఇక్కడి నుంచి సైన్యాధికారులు పాలనలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు.ఒకవైపు భారత్ రాజ్యాంగం రాసుకుని మొదటి ఎన్నికలు సగర్వంగా నిర్వహించుకుంటే పాకిస్థాన్ ఇంకా రాజ్యాంగం ఎలా ఉండాలనేదానిమీదే కొట్టిమిట్టాడుతుంది.మిలటరి జనరల్ అయూబ్ ఖాన్ 1953-58 కాలంలో దేశ రక్షణ, హోంమంత్రి గా పనిచేశారంటే పరిపాలన దాదాపు సైన్యం చేతిలోకెళ్ళిందనే చెప్పవచ్చు.

ఇలా మొదటి దశాబ్దం ఒక స్థిరమైన పౌరనాయకత్వం లేకుండా పాక్ సైన్యం చేతిలోకి పరిపాలన వెళ్ళింది.


2.మిలటరి తిరుగుబాటు అయూబ్, యాహ్యఖాన్ పరిపాలన, బంగ్లాదేశ్ ఆవిర్భావం(1956-71).


మిలటరీ పరిపాలిస్తుందంటే వాళ్ళ ప్రధాన దృష్టి భద్రత మీద ఉంటుంది అలాగే మిలటరీ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మిగతా అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తారు ఇక్కడ పాకిస్థాన్ సైన్యం స్వభావం ఎలా ఉంటుందంటే

 భారత్ ని హిందూ దేశం శత్రు దేశంగా చూడడం 

ఐదురెట్లు పెద్దదైనా భారత్ తో మిలటరి పరంగా సమాన స్థాయి ని కోరుకోవడం.ఇందుకోసం అమెరికా మీద ప్రధానంగా ఆధారపడడం.నెహ్రూ అమెరికా వెళ్ళి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాయం కోరితే,అయూబ్ ఖాన్ ట్యాంకులు,యుద్ధ విమానాల కోరికల చిట్టా విప్పేవారంటే రెండు దేశాల పయనపు పునాదులు ఎటువైపు పడిందో మనకి అర్థం అవుతుంది.


కాశ్మీర్ సమస్యను బూచిగా చూపి దేశ భద్రతకి తామే పూర్తి కారకులమన్నట్లుగా ప్రజలలో ప్రచారం చేయడం.

భారత్ తో జరిగిన అన్నీ యుద్ధాలలోను ఒక దేశాన్ని కాకుండా ఇస్లాం ను రక్షించడానికి  పవిత్ర యుద్ధం జీహాద్ చేస్తున్నట్లుగా సైనికులను రెచ్చగొట్టటం లాంటి అహేతుక భావాలను సమాజంలోకి చొప్పింపజేశారు.


1962 భారత-చైనా యుద్ధమప్పడు అయూబ్ కాశ్మీర్ని వదులుకుంటే సంయుక్తంగా చైనామీద యుద్ధం చేద్దామని నెహ్రూకి ప్రతిపాదన పంపాడు.నెహ్రూ అందుకు తిరస్కరించిడంతో 1963లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉత్తర భాగమైన గిల్గిత్ బల్జిస్థాన్ 

సరిహద్దు సమస్యను భారత్ ప్రమేయం లేకుండా కొంత భూభాగాన్ని చైనాకిచ్చి పరిష్కారం చేసుకున్నాడు.ఇలా చాలా విషయాల్లో అలిగి భారత కు వ్యతిరేకంగా వ్యవహరించడం పాకిస్థాన్ అధికార వర్గాలకి అలవాటైంది.

అమెరికా ఇచ్చిన ఆధునిక ఆయుధ సంపత్తి,చైనా యద్ధం తర్వాత భారత్ బలహినపడిందని అనుకోవడం,నెహ్రూ చనిపోయిన తర్వాత వచ్చిన లాల్ బహుదూర్ శాస్త్రి గారిని బలహీన నాయకుడని అనుకోవడం,ముస్లిం సైనికుడు హిందూ సైనికుడు  కన్నా బలమైన వాడు అనే వింత భావన లాంటి ప్రధాన కారణాలతో అయూబ్ 1965 యుద్ధం ప్రారంభించాడు.

పాకిస్థాన్ కి ఆధునిక ఆయుధాలు ఉన్నప్పటికి సంప్రదాయ యుద్ధంలో భారత్ చాలా  కష్టంగా పాకిస్థాన్ ని ఓడించగలిగింది.ఇరువైపులా దాదాపు సమాన నష్టం జరిగింది. అయితే పాక్ మిలటరి దేశ ప్రజలకు యుద్ధంలో మన కంటే పెద్ద దేశాన్ని నిలువరించాము అని ప్రచారం చేసుకుంది.


మొదటి నుండి సైన్యం లో పంజాబీలు పఠాన్ల ఆధిపత్యం ఉండేది దీనివలన మిగతా ప్రావిన్సులైన సింధు,బెలూచిస్థాన్, తూర్పు పాకిస్థాన్(బెంగాల్)లలో అసంతృప్తి ఎక్కువ ఉండేది.బెంగాలీలను కాలా అని తక్కువ ముస్లింలని అవమానించేవారు.ఆర్థిక వనరులు కూడా బెంగాల్ కి తక్కువ గా పంచడం,సివిల్ సర్వీస్లో కూడా తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బెంగాలీ భాషోధ్యమం లాంటి కారణాలతో తూర్పు పాకిస్థాన్ లో వేర్పాటువాద ఉధ్యమం ప్రారంభమయ్యింది.


దేశంలో వ్యతిరేకత పెరగడంతో అయుబ్ వైదొలిగి ఇంకో మిలటరి జనరల్ యాహ్యఖాన్ కి పరిపాలన అప్పజెప్పాడు.1970లో మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించడం  ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వ లో అవామీ లీగ్ పార్టీ మెజార్టీ సాధించనప్పటకీ ఆయనని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం తర్వాత భారత్ సహాయంతో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరగడం పాకిస్థాన్ నాయకులకు వాళ్ళ భారత వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అవకాశం ఇచ్చింది.ఇస్లాం పేరుతో దేశాన్ని ఒకటిగా ఉంచలేము దేశ విభిన్న సంస్క్రతులను గౌరవించడం తోనే సమైక్యత ఉంటుందని గ్రహించలేకపోయారు.

దాయాది దేశమైన భారత్ భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి రాజ్యాంగంలో అధికార భాషలుగా ప్రధాన మైన భాషలను  గుర్తించడం,మత పరంగా భాషాపరంగా మైనార్టీ ప్రజలకు హక్కులు రక్షణ కల్పించడం లాంటి సమైక్యతకు దోహదం చేసేటువంటి చర్యలను చూసి పాకిస్థాన్ అధికార వర్గాలు పాఠాలు నేర్వలేదు.ఫలితమే బంగ్లాదేశ్ ఆవిర్భావం.ఈ యుద్ధం లో దాదాపు పదినుంచి ఇరవై లక్షల మంది దాకా మిలటరి ఊచకోత,యుద్ధ రంగంలో మరణించారు.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద నరమేధం కానీ ఇవన్నీ పాకిస్థాన్ పాలకుల తీరును మార్చలేదు కదా 

దేశంలో ఇస్లామీకరణ పూర్తి స్థాయిలో ప్రారంభించారు.


 3.పాకిస్థాన్ పూర్తి ఇస్లామీకరణ దశ,భుట్టో,హక్ పరిపాలన (1971-1989):

బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత జుల్ఫికర్ ఆలీ భుట్టో పాకిస్థాన్ పరిపాలన చేపట్టాడు.కాస్తో కూస్తో ప్రజాదరణ ఉన్న ఈయన పరిపాలనలో పాకిస్థాన్ అభివృద్ధి మీద దృష్టి నిలుపుతుందని ఆశించారు.సామ్యవాద భావాలతో లౌకిక భావనలు(పాకిస్థాన్ నాయకులతో పోలిస్తేనే) ఉన్న వ్యక్తి గా ఆయనకు పేరుంది.కానీ భారత్ వ్యతిరేకత నరనరాల్లో జీర్ణించుకు పోవడంతో దేశం ఐక్యంగా ఉండాలంటే ఇస్లాం పేరుతోనే సాధ్యమవుతుందన్న భావన అక్కడి అధికార వర్గాల్లో మారలేదు.ఇస్లామిక్ దేశాల మద్దతు కోసం పశ్చిమ ఆసియా దేశాలైన సౌదీఅరేబియా  లాంటి దేశాల పై ఎక్కువ ఆధారపడడం ప్రారంభించాడు.ఈ క్రమంలోనే కాస్తో కూస్తో సహనానికి పేరొందిన ఉపఖండ ఇస్లామిక్ సంస్క్రతి కి పాకిస్థాన్ సమాజం దూరమై అరబిక్ ఇస్లాం కి దగ్గరవడం ప్రారంభమైంది.మదరసాలు పెరిగాయి‌‌,పరిపాలనలో ముల్లాల జోక్యం మొదటినుంచీ ఉన్నప్పటికీ అది తీవ్ర తరమైంది.ఎంతలా అంటే అహమ్మదీయ ముస్లింలను పార్లమెంట్లో చట్టం చేసిమరి ముస్లింలుగా గుర్తించకపోవడం.అహమ్మదీయులు గులాం అహమ్మద్ అని పంతొమ్మిదో శతాబ్దపు మత ప్రబోధకుడుని ఒక ప్రొఫెట్ గా భావించడం వారిని ముస్లింలను గుర్తించకపోవడానికి ప్రధాన కారణం అంటే ఇస్లాం అధికారమతం దగ్గర ఆగలా ఎవరు నిజమైన ముస్లింలు అనే దగ్గరకు మత చాంధసవాదం పెరిగింది.


ఈ కాలంలోనే పాకిస్థాన్ అణు సామర్థ్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.Nuclear nationalism found its first champion in Bhutto who declared Pakistan would fight India for a thousand years, and that Pakistan would get the bomb even if it meant having to eat grass.


మొదటి నుంచి పాకిస్థాన్ నాయకులు పొరుగు దేశమైన ఆప్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు.ఆ దేశం లో పాకిస్థాన్ అనుకూల ప్రభుత్వం కావాలని శాయశక్తులా ప్రయత్నించేవారు.

బ్రిటిష్ పాలకులు వాళ్ళకి తలనొప్పిగా మారిన ఫక్తూన్ తెగను విభజించడానికి ఫక్తూన్ ప్రావిన్స్ ని రెండు గా విడదీసి అప్పటి బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లమద్య డ్యురాండ్ సరిహద్దు రేఖ గీశారు.దీనిని ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు ఈ వివాదం కూడా పాకిస్థాన్ ని అభద్రతా భావానికి గురిచేసింది అందుకే ఆ దేశాన్ని తన చెప్పు చేతలలో ఉంచుకోవడం ఒక విధానంగా పెట్టుకుంది.


1977 లో మిలటరి జనరల్ జియావుల్ హక్ భుట్టో అసమర్థ అవినీతి పాలన చేస్తున్నాడని తిరుగుబాటు చేసి పాలనాపగ్గాలు చేపట్టాడు.ఇతని పరిపాలనలోనే పాకిస్థాన్ పూర్తిగా ఇస్లామీకరణ చెందింది. షరియా ప్రకారం చట్టాలు ప్రారంభించారు.మదరసా విద్యను విపరీతంగా ప్రోత్సాహించారు.మైనార్టీల మీద దాడులు పెరిగాయి.ఇస్లాంలోనే exclusiveness  పెరిగింది. మైనార్టీ ముస్లిం తెగలైన షియాలు, అహమ్మదీయుల పై దాడులు పెరిగాయి.దైవదూషణ చట్టాలు(Blasphemy laws) కఠినతరం చేశారు.

చరిత్ర వక్రీకరణ: పాకిస్థాన్ ఇస్లామిక్ నాగరికత పేరుతో పాఠశాలల్లో తప్పనిసరి పాఠ్యాంశాన్ని చేర్చి అందులో హిందువులను ద్రోహులుగా ముస్లిం రాజుల పాలను అతిగా కీర్తిస్తూ చరిత్ర ను చెప్పారు.

ఇందులో చరిత్ర ఎలా ఉంటుందంటే 712ADలో కాసిం సింధు మీద దండయాత్ర చేసినప్పుడు పాకిస్థాన్ చరిత్ర ప్రారంభమై మొఘలుల కాలానికి పాకిస్థాన్ ఉచ్ఛస్థితిలోకి చెందింది అని.అంటే 

712 ముందుకు ఉన్నది అసలు పాకిస్థాన్ చరిత్రే కాదని విస్మరించడం, హిందూ సంస్క్రతి ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం లాంటి వక్రీకరణలు అబద్ధాలు పిల్లలకి నేర్పేవారు మరి ఇలా పెరిగిన వాళ్ళు భారత దేశాన్ని ద్వేషించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.

ఇదే చరిత్ర వక్రీకరణను మన దేశంలో హిందూత్వ వాదులు సమ్మిళిత సంస్క్రతి వ్యతిరేకంగా ముస్లిం రాజులను క్రూరులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మన దేశాన్ని హిందూ పాకిస్థాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమేమిటంటే అదే పాకిస్థాన్ ని వాళ్ళు విపరీతంగా ద్వేషిస్తారు.


ఇదే సమయంలో(1979 )సోవియట్ యూనియన్ ఆఫ్ఘసిస్తాన్ని ఆక్రమించుకోవడం  పాకిస్థాన్ చరిత్రను అలాగే ప్రపంచ ఇస్లామిక్ జీహద్ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది.ఇవి కాశ్మీర్ సమస్యపై తీవ్ర ప్రభావం చూపాయి.

సౌదీఅరేబియా, అమెరికా పాకిస్థాన్ సాయంతో ఆప్ఘనిస్తాన్ లో సోవియట్కు వ్యతిరేకంగా ముజాహిదీన్లను శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.ఈ జిహాదీ స్థావరాలకు ప్రపంచం నలుమూలలనుండి ముస్లిం యువకులు వచ్చారు.ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ జీహద్ ఉధ్యమానికి కేంద్ర బిందువైంది.లక్షల మంది ఆ దేశం నుంచి పాకిస్థాన్ కు శరణార్ధులుగా వచ్చారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ లో కాశ్మీర్ కి వ్యతిరేకంగా ఇస్లామిక్ తీవ్ర వాదులు తయారయ్యారు. పాకిస్థాన్ సైనిక గూఢచారి సంస్థ ISI ఈ తీవ్ర వాదులను కాశ్మీర్ లో భారత్ పైకి ఉసిగొలిపింది.1987లో కేంద్ర ప్రభుత్వమే కాశ్మీర్ ఎన్నికల్లో రిగ్గింగ్ కి పాల్పడడం స్థానికంగా అసంతృప్తి ఇవన్నీ పాకిస్థాన్ తీవ్ర వాదులకు అనుకూలంగా మారాయి.

General Zia-ul-Haq gave form to Bhutto's "thousand years war" with the 'bleeding India through a thousand cuts' doctrine using covert and low-intensity warfare with militancy and infiltration


ఇదే కాలంలో మన  పంజాబ్  రాష్ట్రంలో సిక్కు వేర్పాటువాద  ఖలిస్థాన్ ఉధ్యమానికి పాకిస్థాన్ ISI సహకరించింది.ఆప్ఘనిస్తాన్ లో వాడిన ఆయుధాలు పంజాబ్ లో దొరకడం భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించి సింధు ప్రావిన్స్లో  వేర్పాటువాదాన్ని ప్రోత్సాహిస్థామని అనధికార హెచ్చరిక చేయడంతో పాకిస్థాన్ వెనుకడుగు వేసింది.


4.కాశ్మీర్ మిలిటెంట్ వేర్పాటువాదం ఉచ్ఛదశ పాకిస్థాన్ తీవవాద కేంద్రం గా మార్పు,ముషారఫ్ కాలం(1989-2007).

జియావుల్ హక్ 1988లో విమాన ప్రమాదంలో మరణించాడు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బేనజీర్ భుట్టో  నాయకత్వంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికారానికి వచ్చింది.ఈవిడ కాలంలో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా అంటే రాలేదు. ఎందుకంటే అప్పటికే భారత దేశం తో దౌత్య సంబంధాలు,రక్షణ, కాశ్మీర్ విధానం పాకిస్థాన్ మిలటరి చేతుల్లోనే ఉంది.

పాకిస్థాన్ కాశ్మీర్ లో ఇస్లామిక్ తీవ్రవాదం ప్రోత్సాహిస్తూ స్థానిక మిలటెంట్లకి శిక్షణ ఆయుధ సరఫరా ముమ్మరం చేసింది.పీవి నరసింహారావు నేతృత్వంలో ఈ వేర్పాటువాద ఉధ్యమాన్ని సమర్థంగా ఎదుర్కున్నాము కానీ ఆ క్రమంలో వేలమంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దశాబ్దంలోనే పాకిస్థాన్ అంతర్గతంగా పాకిస్థాన్ ప్రభుత్వం, సైనిక బలగాల మీద దాడులు చేసే ఇస్లామిక్ తీవ్రవాదం ప్రారంభమయ్యింది. బెలూచిస్థాన్ లో ఏర్పాటు వాద ఉధ్యమం కూడా ఒక సమస్యగా.మారింది.

1999లో పాకిస్థాన్ మిలటరీ కార్గిల్ ల్లో చొరబాటుదారుల పేరుతో కాశ్మీర్ లో కొన్ని స్థావరాలను ఆక్రిమించుకోవడంతో  భారత్ దానిని తిప్పికొట్టడానికి కార్గిల్ యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మిలటరీ జనరల్ ముషారఫ్ నవాజ్ షరీఫ్ ని గద్దెదించి అధికారం చేజిక్కించుకోవడం జరిగింది.


సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్థానికంగా జరిగిన అంతర్యుద్ధంంలో తాలిబాన్లు విజయం సాధించి అక్కడ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ కి ఆశ్రయమివ్వడం 2001లో వరల్డ్ ట్రేడ్ కేంద్రాలపై ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేయడం అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం మళ్ళీ రెండోసారి పాకిస్థాన్ అవసరం అమెరికాకి రావడం అనేవి పాకిస్థాన్ ప్రాధాన్యత పెంచడానికి దోహదం చేశాయి.

ఇలా 2007 వరకు పాకిస్థాన్ ముషారఫ్ పాలనలో ఉంది.

పాకిస్థాన్ పెంచిపోషించిన ఇస్లామిక్ తీవ్ర వాదులు అంతర్గతంగా దాడులు చేయడం అందులో వేలమంది ప్రాణాలు కోల్పోవడం అనేది పాకిస్థాన్ స్వయంకృపరాధంగా చెప్పుకోవచ్చు.ఆ తీవ్ర వాదులు పొరుగున ఉన్న షియా మెజార్టీ దేశమైన ఇరాన్ లో కూడా దాడులు చేస్తుండడంతో ఇరాన్ తో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి.

 పాకిస్థాన్ మీద దాడి చేసేవాళ్ళను భద్రతకు ప్రమాదంగా చూడడం ఇతర దేశాల మీద ప్రత్యేకంగా భారత్ మీద దాడి చేసేవారిని ఏమీ చేయకుండా ఉండడం పాకిస్థాన్ ద్వంద్వ విధానాన్ని తెలియజేస్తుంది.

2001 లో మన పార్లమెంట్ మీద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా రెండు దేశాలు అణు సామర్థ్యం కలిగి ఉండటంతో యుద్ధానికి దారితీయలేదు.

2004 లో ముషారఫ్ భారత్ కి హామీ ఇచ్చాడు తమ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వదని కానీ ఆ మాట ఇప్పటికీ పాకిస్థాన్ నిలబెట్టుకోలేదు.

2007 లో బేనజీర్ భుట్టోని  అదే ఉగ్రవాదులు బాంబుదాడితో చంపారు.ముషారఫ్ మీద కూడా ఉగ్రవాదులు హత్యాయత్నం చేశారు.


5.ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన(2007-2019).

పాకిస్థాన్ చరిత్ర లో మిలటరీ పాలనలేకుండా ఈ దశాబ్దం సాగింది.2008లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గెలిచి

పాకిస్థాన్ చరిత్ర లో మొట్టమొదటి సారి ఒక పౌర ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనని పూర్తి చేసింది. తర్వాత 2013లో నవాజ్ షరీఫ్ 2018 లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో కి వచ్చారు.

 ముంబై దాడులు 2008 లో జరిగిన తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ మీద ఒత్తిడి పెరిగింది.

భారత దేశ ప్రాధాన్యత అంతర్జాతీయ సంబంధాలలో మెరుగవ్వడంతో పాకిస్థాన్ కాశ్మీర్ లో తప్ప మిగతా దేశంలో దాడులు తగ్గించింది.

 పాకిస్థాన్ లో తీవ్ర వాదం ఎంత పెరిగిందంటే కొన్ని తీవవాద గ్రూపులు పాకిస్థాన్ ఆర్మీ ఆధీనం లేకుండా పోయాయి.

2014లో పాకిస్థాన్  పెషావర్లోని ఆర్మీ పాఠశాల మీద దాడి చేసి 

150 మంది దాకా ముక్కు పచ్చలారని పిల్లలను పొట్టపెట్టుకున్నారు.ఈ దాడి పాకిస్థాన్ సమాజాన్ని కూడా బాగా కదిలించింది.అయినా పాకిస్థాన్ విధానంలో పెద్దగా మార్పు వచ్చిన సూచనలు లేవు.ఇప్పుడు అమెరికా మద్దతు పెద్ద గా లేకపోయినప్పటికీ చైనా పాకిస్థాన్కి వెన్నుదన్నుగా నిలబడడం ఆ దేశ విధానంలో మార్పు అంత త్వరగా ఆశించలేము.


ముగింపు: 


పాకిస్థాన్ ఆవిర్భావానికి కారణమైన ద్విజాతి సిద్దాంతం ముస్లింలు హిందువులు వేరు జాతులనేది తప్పు. అది బంగ్లాదేశ్ ఆవిర్భావంతో నిరూపణ అయ్యింది.

జిన్నా ,లియాకత్ ఆలీఖాన్ లు ప్రారంభ సంవత్సరాలలోనే చనిపోవడం ఆ దేశానికి పెద్ద దెబ్బ.తర్వాత ఆ దేశానికి సరైన నాయకత్వం ఎప్పుడూ లేదు.


కాశ్మీర్ సమస్యకు  పాకిస్థాన్ అత్యంత ప్రాధాన్యత నివ్వడం పెద్ద విధాన వైఫల్యం.


ఆవిర్భావం నుంచి మిలటరీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రత్యేకంగా భారత దేశ దౌత్య సంబంధాలు,రక్షణ, కాశ్మీర్ పై విధానం తన చెప్పచేతల్లో ఉంచుకోవడంతో పాకిస్థాన్ దేశానికి మిలటరీ కాకుండా మిలటరీ కోసం దేశం అన్నట్లైంది.


ఇస్లామీకరణ పాకిస్థాన్ సమాజాన్ని బ్రష్టు పట్టించింది.

మత చాంధసవాదం పెరిగి ఆధునిక భావాలకు పెద్ద పీటవేయలేకపోయారు.భారత ఉపఖండ సంస్క్రతికి తనూ ఒక వారసురాలిగా ఉండకుండా సౌది అరేబియా లాంటి దేశం ఇస్లాంని తమ దేశంలో ప్రోత్సాహించడం.

చరిత్ర వక్రీకరణ చేసి భారత దేశం మీద ద్వేషం పెంచడం.


స్వతంత్రంగా ఆర్థిక వ్యవస్థ ని అభివృద్ధి చేసుకోకుండా అమెరికా పై ఆయుధాలకి ఎక్కువ ఆధారపడడం ఆ దేశ విధానం లో భాగంగా చేసిన 1979 మరియు 2001 ఆఫ్ఘసిస్తాన్ యుద్ధాలు పాకిస్థాన్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం పడగలెత్తడానికి కారణం అయ్యాయి.


ఎప్పుడూ ఆరు రెట్లు పెద్దదైన భారత దేశంతో పోలిక పెట్టుకోవడం ప్రత్యేకంగా ఆయుధ సంపత్తి కోసం ఈ పోలిక ఉండడం ఆ దేశానికి పెద్ద చేటు చేసింది.


విభిన్న సంస్క్రతులను గౌరవించకపోవడం అనేది ఇప్పటికీ పాకిస్థాన్ లో ఉన్న పెద్ద లోపం.


మన దేశంలో ప్రత్యేకంగా హిందూత్వ జాతీయ వాదులు 

పాకిస్థాన్ చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన మరియు తెలుసుకోవాల్సిన  పాఠాలు.


మతాన్ని వ్యక్తి గత వ్యవహారం గా ఉంచి పాలనతో వేరు చేయడం.

మన దేశ విభిన్నతను గౌరవించడం.హిందీని హిందూత్వ సిద్దాంతాన్ని ప్రజలమీద  రుద్దకుండా ఉండడం.

మైనార్టీ హక్కులను పరిరక్షించడం 

మిలటరీని రాజకీయాలలోకి లాగకుండా ఉండడం.


దేశ భద్రత కింద ఆర్థిక, సామాజిక భద్రత లు కూడా వస్తాయి.

మత సామరస్యం లౌకిక వాదం ఈ దేశ భవితకు గట్టి పునాదులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?