చైనా పాకిస్థాన్లతో నదీ వివాదాలు
భవిష్యత్తు లో యుద్ధాలు నీళ్లకోసం జరుగుతాయి అని అంటారు. మరి మన పొరుగు దేశాలైన పాకిస్థాన్ చైనాలతో మన నీటి సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ పోస్ట్ లో వివరిస్తాను.
నీరు ఎంత విలువైన వనరో మనకందరికీ తెలిసిందే త్రాగు నీరు,సాగునీరు, పరిశ్రమలకు ఇలా మన నిత్యావసరాలకు నీరు లేనిదే గడవదు.మరి అటువంటి దాని మీద దేశాల సంబంధాలు ఆధారపడడం సహజం.
ముందుగా మన దాయాది చెల్లెలు పాకిస్థాన్ తో చూద్దాం. ఆ దేశం మన దేశం మధ్య సింధు నది దాని ఉపనదులైన జీలం,చీనాబ్,రావి,బీయాస్ మరియు సట్లెజ్ నదులు ప్రవహిస్తున్నాయి. బ్రిటీష్ కాలంలో మొత్తం ఒకటే దేశం కాబట్టి సమస్యలు రాలేదు.ఆ కాలంలోనే ఐక్య పంజాబ్ ప్రావిన్స్ లో కాలువల ద్వారా సాగునీటి సదుపాయాలు కొంచం అభివృద్ధి చేశారు.
1947-48 కాశ్మీర్ కోసం జరిగిన ఘర్షణ సమయంలో భారత్ కాలువలు ఆపివేసింది కొంతకాలం.ఆ తర్వాత పాకిస్థాన్ ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండేది భారత్ నీరు ఆపుతుందని.1954 లో ప్రపంచ బ్యాంకు ఇరుదేశాల మద్య ఈ నదుల పంపకం మీద ఒక ప్రతిపాదన చేసింది. అలాగే నీటి పారుదల ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇస్తామని ప్రతిపాదించింది.అలా ఇరు దేశాలు మద్య ప్రపంచ బ్యాంకు మద్యవర్ధిత్వంతో చర్చలు జరిగి 1960 లో సింధు నదీ జలాల ఒప్పందం కుదుర్చుకున్నారు.అప్పటి ప్రధాని నెహ్రూ పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలోని అంశాలను పరిశీలిస్తే ఎగువ పరీవాహక ప్రాంత( upper riparian) దేశం అయినప్పటికీ భారత్ పాకిస్థాన్ పట్ల ఉదారంగా ప్రవర్తించిందనే చెప్పుకోవాలి.నెహ్రూ ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి అలాగే భవిష్యత్లో దాయాది దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి దోహదపడుతుందని ఆశించారు.ఇవైతే జరగలేదు గానీ పాకిస్థాన్ తో మూడు యుద్ధాలు(1965,1971బంగ్లాదేశ్ ,1999 కార్గిల్) జరిగినప్పటికీ భారత్ ఎప్పుడూ నీటి జోలికి పోలేదు.ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీజలాల ఒప్పందంగా దీనిని చెప్పకుంటారు.ఇందుకు మన దేశ నాయకుల సంయమనం రాజనీతిజ్ఞతను ప్రశంసించాలి.
ఇక ఒప్పందంలో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం.
1.ఆరు నదులలో తూర్పు నదులైన సట్లెజ్,రావి మరియు బియాస్ నదులను ఏవిధంగా నైనా భారత్ ఉపయోగించుకోవచ్చు.కాకపోతే పాకిస్థాన్ వైపుకి కొంత మినిమం ప్రవాహం ఉంటేట్లు చూడాలి.ఎందుకంటే నదీ జీవ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి.
దీని ప్రకారం మొత్తం సంవత్సర కాలంలో ప్రవాహం168 Million Acre Feet (MAF)(ఆరు నదులను కలిపి) ఇరవై(20) శాతం మన దేశానికి ఈ మూడు నదుల ద్వారా వస్తుంది.
2. పశ్చిమ నదులైన సింధు, జీలం చీనాబ్లను పాకిస్థాన్ కి కేటాయించారు.అయితే ఈ నదీ జలాల్ని భారత్ పవర్ జనరేషన్,చేపల పెంపకానికి,త్రాగు నీరుకి నదీ ప్రవాహం దెబ్బతినకుండా వాడుకోవచ్చు.ఈ ప్రాజెక్టులు ఎలా కట్టాలి అనేదానికి పరిమితులు ఉన్నాయి.
3. ఒక శాశ్వత ఇండస్ కమీషన్ ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం ఇది కలిసే విధంగా నీటి ప్రవాహ సమాచారం అలాగే చిన్న చిన్న పొరపొచ్చాలను తీర్చుకునే విధంగా ఈ కమీషన్ విధి విధానాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ కూడా తగాదా తీరకపోతే తటస్థ పరిశీలకులతో ఏర్పాటు చేసిన Permanent Court of Arbitration(PCA) ద్వారా వివాదాన్ని పరిష్కరించుకొని దీని తీర్పును గౌరవించేవిధంగా ఒప్పందం లో అంశం పొందుపరచారు.
మరి ఈ ఒప్పందాన్ని ఏ దేశమైనా ఏకపక్షంగా తిరస్కరించ వచ్చా ? లేదు ఉభయ దేశాలు పరస్పర అంకీకారంతో మాత్రమే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.ఏకపక్షంగా వెళితే 1969 వియన్నా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం ఆ దేశం సంజాయిషీ ఇచ్చుకోవాలి.
ఇప్పటి వరకు మనము ఈ నదీ జలాలను అంటే మొత్తం మన వాటాకు వచ్చిన 33MAF లో 30MAF ఉపయోగించుకుంటున్నాము.మిగతా ది పాకిస్థాన్ వైపు వెళ్తుంది.
ఇక పశ్చిమ నదులలో కొన్ని ప్రాజెక్టులు వులార్ లాంటికి ప్రతిపాదించినప్పటికీ PCA లో తీర్పు కోసం ఎదురు చూస్తున్నాము.
ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించేవాళ్ళు 80% శాతం జలాలని పాకిస్థాన్ కి కేటాయించడాన్ని వేలెత్తి చూపుతున్నారు. కానీ అరవై సంవత్సరాలైనా ఇంకా మనకి కేటాయించినవే పూర్తిగా వినియోగించుకోలా అలాగే పశ్చిమ నదుల జలాలను కూడా ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది కానీ
పర్యావరణ సమస్య, భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం లాంటి వాటి వల్ల అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి.
అయితే ఒప్పందంలో కొన్ని మార్పులైతే చేయవలసిన అవసరం ఉంది.
గుజరాత్ రాష్ట్రం సింధు నదికి దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతం.సింధు నదీ వరదల వలన ఆ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అందువలన గుజరాత్ ని కూడా పరిగణనలోకి తీసుకొని పాకిస్థాన్ సింధూ నది నుంచి ప్రవాహాన్ని నియంత్రణ చేసే అంశాన్ని పొందుపరచాలి.
1960 కి ఇప్పటికీ హైడ్రోపవర్ ప్రాజెక్టులు కట్టే సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి ఉంది.అందువలన అప్పటి నిబంధనలు ఇప్పటికి సరిపోవు కావున నిర్దేశిత నిబంధనలు మార్చాలి.జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో లో ఈ ఒప్పందం లో మార్పులు కోసం తీర్మానాలు చేశారు.వాటిని కూడా పరిగణలోనికి తీసుకొని ఒప్పందంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.
నదీ జలాలను రాజకీయాలకి అతీతంగా ఉంచడం అనేది ఉభయ దేశాలకు శ్రేయస్కరం. ఎక్కువగా నష్టపోయేది సామాన్య జనం.వ్యవసాయం మీద ఎక్కువ గా ఆధారపడి జీవించేది బడుగు వర్గాల వారే ఉభయ దేశాలలోను.పాకిస్థాన్ కైతే ఈ నదీ జలాలు జీవనాడిలాంటివి.అందుకే కాశ్మీర్ కోసం అంత పట్టు పట్టేది.స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి కాశ్మీర్ జపం చేయడానికి ఒక ప్రధాని కారణం కాశ్మీర్ నుంచి వచ్చే ఈ నదులు.కానీ ఆ దేశం మూడు యుద్ధాలు జరిగినా భారత్ నదీ జలాల జోలిపోలేదనే విషయాన్ని మరచి అహేతుకంగా మొండిగా ప్రవర్తిస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది.అలాగే ఆ దేశంలోని తీవ్ర వాద సంస్థలు,అతివాద నాయకులు భారత్ నీటి యుద్ధం చేస్తుందని ద్వేషం పెంచుతున్నాయి.
ఇక దాయాది చెల్లెలుతో పరిస్థితి ఇలాగుంటే పెద్దక్క చైనా తో సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
సింధు సట్లెజ్ నదులు టిబెట్ లో పుట్టినా సింధూ నదీ జలాల ఒప్పందం లో చైనా భాగం కాదు.
ఈశాన్య భారతంలో ప్రవహిస్తున్న బ్రహ్మ పుత్రా నది చైనా దేశంలోని టిబెట్ ప్రాంతంలో పుట్టింది.ఈ నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ల గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లో ప్రవహాంచి బంగాళాఖాతంలో కలుస్తుంది.
భారత చైనా యుద్ధం1962 తర్వాత సంబంధాలు క్షీణించి 2002 దాకా నదీ జలాలకు సంబంధించి ఏపురోగతీ సాదించలేదు.2002 లో
Hydrological information sharing MoU(Memorandum of Understanding)కుదుర్చుకున్నారు. అంటే నదీ ప్రవహం ఎలా మారుతుంది ఎంత వస్తుంది అనేది చైనా మనకు ముందు సమాచారం ఇస్తుందనమాట.దీనివలన వరదలు ఎక్కువగా వచ్చే బ్రహ్మ పుత్రానదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు వరదలకి సన్నద్దంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
ఇక చైనా ఏ డామ్లు ఎక్కడెక్కడ కడుతుంది ఎంత సామర్థ్యం తో కడుతుందీ అనే ప్రాధాన్యమైన విషయాల మీద మనకు పూర్తి సమాచారం లేదు.ఇందుకు స్పష్టమైన ఒప్పందం కూడా లేదు.ఇక నదీ జలాల ఒప్పందం మాట చనిపోయిన మావో కే ఎరుక.
దిగువ పరీవాహక ప్రాంతంలో ఉన్న దేశానికి సహజంగా ఎగువన ఉన్న దేశం ఏం చేస్తుందో అన్న ఆందోళన సహజం.అదీ కాక చైనా బ్రహ్మా పుత్రా నది మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతుందనే వార్తలు దీనిని మరింత తీవ్ర తరం చేశాయి.
నీరు పుష్కలంగా ఉన్న టిబెట్ నదులను కరవు ప్రాంతాలకు తరలించడానికి చైనా పెద్ద ప్రణాళికలే వేసింది.వాటిని అమలు పరచడంలో కూడా చాలా వేగంగా ముందుకెళుతుంది.అక్కడ ఏం జరుగుతుందో మనకు పూర్తి సమాచారం లేదు.అందుకు ఒక ఒప్పందం కుదుర్చుకునేలే మన దేశం బంగ్లాదేశ్ తో కలిసి ముందుకు వెళ్ళాలి.
కొంతలో కొంత ఊరట ఏమిటంటే బ్రహ్మ పుత్ర లో సగం నీటి ప్రవాహం భారత దేశంలో వర్షపాతం వల్ల వస్తుంది. సగం మటుకు టిబెట్ గ్లేసియర్సు నుంచి వస్తుంది. చైనా ఉపయోగించుకున్నా మనకు నీటి ప్రవాహం పరిమాణంలో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ చైనా ప్రాజెక్టుల వలన వచ్చే నీటి ప్రవాహం మార్పులు మన దగ్గర వరదలు,నదీ జీవ వైవిధ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి.ఇది మనం జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చైనాతో నదీ జలాల ఒప్పందం అనేది ఇప్పట్లో కుదిరే అవకాశం లేదు.ఆ నీటిప్రవాహ MoU లోనే మరింత సమాచారం కోసం ప్రయత్నాలు చేయాలి.
మనం పాకిస్థాన్ బంగ్లాదేశ్ లతో వ్యవహరించే తీరు కూడా చైనాతో జల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది. ఆ దేశాలతో పెద్దక్కగా ప్రవర్తించి చైనా దగ్గర ఎక్కువ డిమాండ్ చేయడానికి కుదరదు.
చైనా పాకిస్థాన్ సంబంధాలు మనకి వ్యతిరేకంగా బలపడే కొద్ది ఆ ప్రభావం ఈ నదీ జల ఒప్పందాల మీద పడుతుంది. దీనిని గమనించి మనం ముందుకెళ్ళాలి.
ఐక్యరాజ్య సమితి లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్న మనం అంతర్జాతీయ స్థాయిలో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందానికి కట్టుబడి ఉండటం శ్రేయస్కరం. రాజకీయాలు మాని ఒప్పందంలో భాగంగా మనకు కేటాయించిన నీటిని ఉపయోగించుకోవడం మీద దృష్టి నిలపడము మన అభివృద్ధి కి ఇంకా శ్రేయస్కరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి