ఓల్గా నుండి గంగకు-రాహుల్ సాంస్కృతయాన్ పుస్తకం రివ్యూ

 రాహుల్ సాంకృతయాన్-ఓల్గా నుంచి గంగకు-పుస్తక సంక్షిప్త విశ్లేషణ.

ఈ  పుస్తకం తెలుగు,హిందీ,మరియు ఆంగ్ల భాషలలో దొరుకుతుంది. 



చరిత్రలో ఎనిమిది వేల ఏళ్ళలో సమాజం ఎలా మార్పులు చెందిందో కాల్పనిక(ఊహాజనిత)కథలతో ఇండో యూరోపియన్ ఆర్యన్ తెగలను ఉదాహరణగా తీసుకుని రాశారు.

క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రింద ఓల్గా నది(రష్యాలో) ఒడ్డున నివసించిన మాతృస్వామ్య వ్యవస్థని వివరిస్తూ కుటుంబాలు సమూహాలు ఎలా ఉండేవి నిష అనే కథ ద్వారా ప్రారంభిస్తారు.ఆ తర్వాతి కథ కూడా మాతృస్వామ్య వ్యవస్థదే.

ఆ సమూహాలు ఎలా తెగలుగా మారాయి, ఇండియా వైపు పయనం,పశు పాలన మరియువ్యవసాయం ఎలా పరిణామం చెందాయి, తెగల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు,పితృస్వామ్య వ్యవస్థగా మారడం‌,పకృతి దేవతలను పూజించడం,లైంగిక సంబంధాల పరిణామం,కొన్ని వందల ఏళ్ళ తర్వాత స్వేచ్ఛ జీవనం నుండి బానిసత్వానికి మారడం,వర్ణ వ్యవస్థ ఏర్పడడం,వృత్తుల విభజన,ఆధిపత్యం కోసం కుల వ్యవస్థ ప్రారంభం,గ్రీకు,పర్షియన్ లాంటి మద్యప్రాచ్యదేశాలతో భారతీయుల సంబంధాలు,ప్రాచీన భారత దేశంలో విధ్య వైద్యం,భారత సమాజం కూపస్థమండూకమై తిరోగమన బాట పట్టడం,మహమ్మదీయుల రాక,హిందూ ముస్లిం సంబంధాలు, బ్రిటిష్ పాలన,రెండవ ప్రపంచయుద్దం ప్రారంభం దాకా అంటే 1942 లో ఒక కథతో మొత్తం ఇరవై కధలు పూర్తి అవుతాయి.

ఎనిమిది వేల ఏళ్ళలో రష్యాలోని ఓల్గా నదినుంచి ప్రారంభమైన ఈ కథా పల్లవి పదివేల కిలోమీటర్లు ప్రయాణించి గంగా నది ఒడ్డున క్విట్ ఇండియా ఉధ్యమ కాలంలో ఇద్దరు భారతీయుల సంభాషణ కథతో ముగుస్తుంది.

భారత దేశ ఆధునిక సాహిత్య చరిత్రలోనే ఈ పుస్తకం ఒక క్లాసిక్ గా చెప్పుకుంటారు.భారతీయ భాషలే కాకుండా చాలా విదేశీ భాషలలో దీనిని అనువదించారు.

నేను తెలుగు ఆంగ్లం రెండు భాషలలో చదివాను.తెలుగు అనువాదంలో కొన్ని పంటిక్రింద రాళ్ళు తగిలినా చరిత్ర క్రమానుగత సామాజిక పరిణామాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఏకబిగిన చదవగలిగే పుస్తకం ఇది.


ఏ కథకా కథ మనకు స్వతంత్రంగా ఉన్నా వందల సంవత్సరాల కాలం నిడివి ఉన్నా  ప్రతీ కథకు తర్వాతి కథతో  సంబంధం ఉండేవిధంగా చరిత్ర మార్పులను కాల్పనిక కథలతో రాయడమనేది ఈ పుస్తకం ప్రత్యేకత.తక్కువ పేజీలలో ఎక్కువ చరిత్రను తెలుసుకున్న మంచి అనుభూతి మిగులుతుంది. కాకపోతే చరిత్ర మీద ఆసక్తి కాస్తో కూస్తో పూర్వజ్ఞానం ఉంటే ఈ పుస్తకాన్ని ఇంకా బాగా ఆస్వాదిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మోదీ రాజకీయ జీవితంపై నా అభిప్రాయం

అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి?